వివాహం అనేది ఓ వ్యక్తిని వ్యక్తిగత పరిధి నుండి సామాజిక పరిధికి విస్తరింపచేసే ఓ సాధనంగా గోచరిస్తుంది. దానికి కారణం వివాహం అనేది ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుని, దానిని బలపరుచుకోవడానికి చేసే ప్రక్రియే అయినా; వివాహాన్ని ఆ ఇద్దరూ కూడా తమ వరకే అని అనుకోలేరు. వివాహాన్ని,జీవిత భాగస్వామిని సమాజంలో తమ ఐడెంటిటీ కార్డ్స్ అని అనుకునేవారు కూడా నేటికి ఉన్నారు. వ్యక్తుల లైంగికతకు-స్వేచ్ఛకు ఒక పవిత్రతను ఆపాదించే సాధనంగా వివాహం ఉన్నది అని భావించేవారు మరికొందరు. నాటి నుండి నేటి వరకు వివాహమనే బంధం బలపడిందా, లేకపోతే కాలంతో పాటు వివాహ ప్రాధాన్యత తగ్గిపోతోందా అనే అంశాన్ని ఆలోచిస్తే; వాస్తవానికి మనిషి తనకు తాను ఒక రకమైన వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకునేంత ఉక్కిరిబిక్కిరితనం వివాహంలో ఉండటము,వివాహంలో ఒకరి మీద ఒకరికి ఓనర్షిప్ ఫీలింగ్ కలుగడం,కాలక్రమంలో అది 'టేకెన్ ఫర్ గ్రాంటెడ్'గా మారిపోవడము వల్ల నిజంగానే కొంత వివాహ బంధ దృఢత్వం సన్నగిల్లింది అని ఒప్పుకోక తప్పదు. ఈ వివాహ వ్యవస్థలో ఉన్న లోటు పాట్లను, లైంగిక అభిరుచులు వివాహ బంధాన్ని ప్రభావితం చేస్తున్న తీరును, వివాహం పట్ల విముఖత కలుగడానికి గల కారణాలను, ఇంకా అనేక వివాహ సంబంధిత అంశాలను 'కస్తూరి విజయం' సాహితీ సంస్థ 'తిరగబడ్డ ఉచ్చు' పేరుతో వివిధ రచయితలు వివాహం మీద రాసిన కథలను ఒక సంకలనంగా తీసుకువచ్చింది. ఈ సంకలనంలోని 21 కథలు వివాహ వాతావరణంలో ఉన్న అనేక అంశాలను స్పృశించినవే. ఈ సంకలనం చదివితే తప్పకుండా వివాహ వ్యవస్థను పాఠకులు అనేక కోణాల్లో లోతుగా అర్థం చేసుకోవచ్చు.